Saturday, 20 June 2015

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం....

Chinna Pillala Kathalu - Monkey Story
ఒక నాడు ఓ కోతి అడవిలో గెంతుతూ వుంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది, అది వూళ్ళోకొచ్చి ఒక మంగలిని ఆశ్రయించింది, మంగలి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు.

ఓ కోతి... ఓ కోతి... నా కత్తి....నా కత్తి... అన్నాడు

కోతి వెనక్కి తిరిగి, ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం... అని వెక్కిరించి పారిపోయింది.

కత్తి తీసుకుని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది.

ఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది.,జాలిపడి అతని చేతికి కత్తి అందించింది, ఆ మనిషి సంతోశంగా మట్టెలు కత్తితో కొడుతుంటే, పక్కన పడేసిన మట్టెలను కోతి తీసుకుని ఉడాయించింది.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం......కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం..... అని పాడుకుంటూ తన దారిని వెళ్ళిపోయింది కోతి.

దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేల మీద బెల్లం అచ్చులు వేయడం చూసి, ఆ మట్టలు అతనికి ఇచ్చింది. ఆసామి మట్టలు పరుచుకుని బెల్లం అచ్చులు వాటిమీద పెట్టడం మొదలు పెట్టాడు, అలవాటు ప్రకారం కోతి బెల్లం అచ్చులు తీసుకుని, వెక్కిరిస్తూ పారిపోయింది.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం.....కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం.......మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం.....

న బెల్లం అచ్చులు.... దొంగ కోతి.... అని లబోదిబోమంటూ ఆసామి చూస్తూ వుండిపోయాడు.

కొంచం దూరానికి ఒక పేదరాశి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరెలు చేస్తూ కనిపించింది, కోతి ఆమెకు బెల్లం అచ్చులు ఇచ్చింది, పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలెట్టింది, అవి చేయంగానే కోతి వండి పెట్టిన బూరెలు తీసుకుని పరిగెట్టింది.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం....
కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం....
మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం.....
అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం.....

కొంత సేపటికి కోతికి గోవుల కాపర్లు ఇద్దరు ఎదురయ్యారు, వాళ్ళకి బూరెలు ఇచ్చింది, వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మయిమరిచిపోయారు, కోతి గోవును తోలుకుని వెళ్ళిపోయింది.

కోతి... కోతి.... మా గోవును ఇచ్చేయి... అని చాలా దూరం కాపర్లు తరిమేరు, కాని కోతి వాళ్ళకు చిక్కలేదు.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం........
కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం.....
మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం......
అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం......
బూరెలు పోయి గోవు వచ్చే ఢాం ఢాం ఢాం....
 
రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలిసిపోయింది.

ఆబ్బ.... చాలా కష్ట పడ్డాను ఇవాళ, వొళ్ళంతా పులిసిపోయింది, వెన్నీళ్ళు కాచు, స్నానం చేసి విశ్రమిస్తాను, అని గోవును ఆజ్ఞాపించింది.

గోవుకి బాగా కోపమొచ్చింది, సలసలా మరిగించిన నీళ్ళను తీసుకొచ్చి కోతి వంటిమీద భళ్ళున పోసేసింది, కోతి కుయ్యో మొర్రో మని ఏడుస్తుంటే, తోలు వూడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందలోకి వెళ్ళిపోయింది.

కథ కంచికి మనం ఇంటికి.

No comments:

Post a Comment