![]() |
Chinnapillala Kathalu |
అనగా అనగా ఒక ఊళ్లో కుంచమంత బ్రాహ్మడు ఉండేవాడు, అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్నచేను వేసుకున్నాడు అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయటం మొదలు పెట్టేవరకు రెండు భమిడిలేళ్లూ, రెండు వెండి లేళ్లూ వచ్చి రాత్రిళ్లు తినివేయటం మొదలు పెట్టినై అవి తినిపోగా ఒకటీ అరా కంకి మిగిలితే మన పొట్టిపిచిక వచ్చి పగలు తినివేస్తూ ఉండేది.
ఒకనాడు బ్రాహ్మడు పొలం వచ్చి చూసుకునే వరకు చేనంతా ఈటుపోయి ఉంది ఒకటీ అరా అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చిక తింటూ ఉంది పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది కోపం వచ్చింది ఈ పిచ్చిక పని పట్టాలి అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చు లేశాడు. పాపం పొట్టిపిచ్చిక అది కానకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది ఇంకేం, బ్రాహ్మడు ఎగిరిగంతేసి దాన్ని చంకలో పెట్టకుని ఇంటికి బయలుదేరాడు ఇక మన పిచ్చిక ఊరుకుంటుందా... చంకలో కూచునే పాట ఎత్తకుంది..
కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ......
కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ.....
రెండుభమిడిలేళ్లు గూ, గూ, గూ.....
రెండు వెండిలేళ్లు గూ, గూ, గూ.....
చేనుకాస్త మేశాయి గూ, గూ, గూ....
నేను కూడా తినబోతే గూ, గూ, గూ....
పొట్టివాడొచ్చాడు గూ, గూ, గూ....
పొంచిపొంచి చూశాడు గూ, గూ, గూ.....
నన్ను పట్టుకున్నాడు గూ, గూ, గూ.....
ఈ పాట వినేవరకు బ్రాహ్మడికి కోపం వచ్చింది చంక బాగా బిగించాడు ఊహూ, మన పిచ్చిక నోరు ముయ్యలేదు మన బ్రాహ్మడు ఏం చేస్తాడూ... ఊళ్లోకిపోతే దీనిపాటవిని అంతా నవ్వుతారు అందుకని ఊరిబయట ఉన్న శెట్టిగారి అరుగుమీద కూచున్నాడు.
మన పిచ్చిక నోరుమూస్తేగా పాడుతూనే ఉంది.
కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ.. కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ.... అని. దీనిపాటవిని శెట్టి బయటకి వచ్చి ఏమండి శాస్త్రుల్లుగారు మీ జొన్నచేనెండతండీ అన్నాడు బ్రాహ్మడు దోసిట చూపి ఇంత అన్నాడు ఇంతేనా... అన్నాడు శెట్టి కాదు అని బ్రాహ్మడు రెండు అరచేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు.
ఓసి ఇంతేనా అన్నాడు శెట్టి అప్పుడు బ్రాహ్మడికి కోపం వచ్చి రెండు చేతులూ బారచాపి ఇంత.....అన్నాడు. ఇంకేం చేయి తీసేవరకు మన పిచ్చిక తుర్రున పారిపోయి చెట్టుమీద కూచుని కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ...
కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ...... అని పాడటం మొదలుపెట్టింది బ్రాహ్మడు బాగా మోసపోయానే అని తన్ను తిట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు.
No comments:
Post a Comment