Thursday, 2 July 2015

అంతా మన మంచికే...

Cinnapillala Kathalu
అనగనగా ఒక రాజ్యం దానికో రాజుగారు రాజుగారి కొలువులో ఒక విదూషకుడుండేవాడు విదూషకుడు మంచి తెలివైనవాడు, చతురుడు, దైవభక్తి కలిగినవాడూను దేవుడిమీద భారం వేసి, ఏం జరిగినా అంతా మన మంచికే అని నమ్మేవాడెప్పుడూను రాజుగారికీ విదూషకుడికీ మంచి స్నేహం.

ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి కొలువుకి పర్షియా దేశం నుంచి ఒక అరబ్బీ వర్తకుడొచ్చాడు ఇరవై గుర్రాల మీదా, ఇరవై ఒంటెల మీదా చిత్రవిచిత్రమైన సామాన్లు పట్టుకొచ్చాడతను, మన రాజుగారికి చూపించడానికి రుబ్బురోలు పొత్రాలంతంత రత్నాలు, రయ్యిన గాల్లో ఎగిరే తివాచీలు, ముత్యాలు కుట్టిన పరదాలు, బంగారపు తీగలతో నేసిన కంబళ్ళు, పొడుగాటి కత్తులు, ఒక వెంట్రుకను నాలుగు వెంట్రుకలుగా చీల్చేటంత పదునైన కటార్లు, మనుషులని మరుగుజ్జులుగా చూపించే అద్దాలు, మీట నొక్కితే ఆడే పాడే బొమ్మలు, చెవిలో పెట్టుకుంటే ఊరవతల ఎవరో మాట్లాడుకునే మాటలు కూడా ఇక్కడికి వినపడే శంఖాలు, ఇలాంటివన్నీను రాజుగారు సరదాపడి అరబ్బీ వర్తకుడు తెచ్చిన కత్తినొకదాన్ని పరీక్ష చెయ్యబోయారు ఇంకేముంది, పదునైన కత్తి మొనకి రాజుగారి చిటికెనవేలు తగిలి కోసుకుపోయింది. బొటబొటా నెత్తురు కారిపోయింది పక్కనే ఉన్న రాణీగారు, అయ్యయ్యో ఎంత పని జరింగిందీ అంటూ చీర చెంగు సర్రున చింపి గబగబా వేలికి కట్టు కట్టేసారు. 

రక్తమైతే ఆగింది గానీ పాపం రాజుగారికి బోల్డంత నొప్పెట్టింది పక్కనే ఉన్న విదూషకుడు చూసినవాడు చూసినట్టు ఊరుకోకుండా, అంతా మన మంచికే అనేసాడు అలవాటు చొప్పున ఇంకేముంది, రాజుగారికి వొళ్ళు మండిపోయింది అసలే వేలు తెగిన నొప్పిమీదున్నవాడికి అయ్యో పాపం అనకుండా, బాగానే అయ్యింది అంటే కోపం రాదూ మరి పైగా రాజుగారాయె కత్తికి తెలీదనుకో రాజుగారని, విదూషకుడికి తెలియద్దూ ఎవరక్కడ అని ఒక్క కేక పెట్టారు రాజుగారు చిత్తం ప్రభూ అని ఇద్దరు భటులు పరిగెట్టుకుంటూ వచ్చారు ఈ విదూషకుణ్ణి పట్టుకెళ్ళి చెరసాల్లో పడెయ్యండి అని ఆఙ్ఞాపించేసారు రాజుగారు అప్పుడైనా ఊరుకోవాలా విదూషకుడు అంతా మన మంచికే అనేసి భటుల వెంట వెళ్ళిపోయాడు.

మరునాడు రాజ్యంలో ఉన్న పల్లె ప్రజలు కొంతమంది రాజుగారి దర్శనం చేసుకుని, మా పల్లెల పక్కనున్న అడవుల్లోంచి పులులొచ్చి మా మేకలని ఎత్తుకుపోతున్నాయి మారాజా మీరొచ్చి పులుల్ని వేటాడి మమ్మల్ని కాపాడాలి అని మొర పెట్టుకున్నారు రాజుగారు సరేనని చెప్పి, పరివారంతో మరునాడు వేటకు బయలుదేరారు రోజంతా పులుల్ని వేటాడి వేటాడి రాజుగారు, పరుగెత్తి పరుగెత్తి రాజుగారి గుర్రం అలిసిపోయాయి నెమ్మదిగా వెనకబడిపోయి పరివారం నుంచి వేరైపోయారు రాత్రైపోయింది కళ్ళు పొడుచుకున్నా కనపడని చిమ్మ చీకటి దారి తప్పిన రాజు గారు ఒక కొండ ప్రాంతానికి చేరుకున్నారు ఆ కొండల్లో నరబలులిచ్చే కొండజాతి వాళ్ళుంటారు ఆ ప్రాంతంలో తిరుగాడుతున్న రాజుగారు ఆ కొండజాతి వాళ్ళకి చిక్కిపోయారు ఇంకేముంది రాజుగారికి పూసల దండలు, పూల దండలేసి బాగా అలంకరించి కొండదేవత విగ్రహం ముందుకి తీసుకుపోయారు బలివ్వడానికి కొండజాతివాళ్ళ గురువు పూజకి తెచ్చిన పండు పుచ్చులు దెబ్బలు లేకుండా ఉందో లేదో చూడండర్రా అన్నాడు వెంటనే కాగడాలు తెచ్చి వాళ్ళు రాజుగారి వొళ్ళంతా పరీక్ష చేసారు వాళ్లల్లో ఒకడికి తెగి కట్టు కట్టి ఉన్న రాజుగారి వేలు కనబడింది ఈ పండు పనికిరాదు దేవరా.. దీనికి దెబ్బ తగిలింది అని అరిచాడు వాడు రాజుగారి కట్లు విప్పేసి, మళ్ళీ అడవిలో వదిలేసారు వాళ్ళు బ్రతుకుజీవుడా అనుకుని పడుతూ లేస్తూ ఎలాగో తెల్లారేసరికి ఒక పల్లె చేరి అక్కణ్ణుంచి అంచెలమీద రాజధాని చేరుకున్నారు రాజుగారు.

రాజభవనానికి చేరగానే విదూషకుడిని చెరసాల నుంచి విడుదల చేయించారు విదూషకా, ఏం జరిగినా మన మంచికే అని నువ్వన్నది మా విషయంలో నిజమయ్యింది ఆనాడు వేలు తెగుండకపోతే మా ప్రాణాలే పోయేవి తెలుసుకోలేక నిన్ను చెరసాలలో పెట్టాము మమ్మల్ని మన్నించు అన్నారు రాజుగారు మహాప్రభో మీరు చెరసాలలో పెట్టడం వల్ల నాక్కూడా మంచే జరిగింది అన్నాడు విదూషకుడు అదెలాగన్నారు రాజుగారు మీరు నన్ను చెరలో పెట్టించకపోయుంటే మీతో పాటు నేను కూడా వేటకి వచ్చుండేవాడిని. కొండజాతివాళ్ళకి ఇద్దరమూ దొరికిపోయేవాళ్ళం దెబ్బ తగిలిన మిమ్మల్ని వదిలేసి బావున్న నన్ను కొండదేవతకి బలి ఇచ్చేసుండేవాళ్ళు చెరసాలే నా ప్రాణాలు కాపాడింది అని చెప్పాడు విదూషకుడు.

1 comment:

  1. చాలా చాలా మంచి చిట్టి పొట్టి కథలతో జ్ఞానాన్ని పెంపొందింపచేస్తున్నందులకు మీకు నా ధన్యవాదములు తెలుపుతున్నాను.

    ReplyDelete