Friday, 31 July 2015

హ్యాపీ బుద్ధా..... లాఫింగ్‌ బుద్ధా......

Laughing Buddha


గుమ్మడికాయలా గుండ్రటి తలకాయ.. బానలాంటి పెద్ద బొజ్జ.. మనసారా నవ్వుతూ కనిపించే ముఖం.. ఈ బొజ్జదేవయ్య ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలకు లోటుండదని విశ్వసిస్తారు హ్యాపీ బుద్ధా, లాఫింగ్‌ బుద్ధా, బుదాయ్‌గా చాలా ఇళ్లలో ఈ వింత రూపం కనిపిస్తూనే ఉంటుంది.

ఈ నిండుమనిషి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి శతాబ్దం కిందట చైనాలో హొటై పేరుతో బౌద్ధ బిక్షువుగా తిరిగేవాడని చెబుతుంటారు భుజాన జోలె, చేతిలో బిక్షాప్రాతతో ఉండే ఆయన.. పిల్లలు ఏది అడిగినా జోలెలో నుంచి తీసిచ్చేవాడట ఉదయాన్నే ఆయన ముఖం చూస్తే.. ఆ రోజంతా హాయిగా గడిచిపోయేదట జపాన్‌లో లాఫింగ్‌ బుద్ధాను ఏడుగురు అదృష్ట దేవుళ్లలో ఒకరుగా భావించి పూజించేవారు థాయ్‌లాండ్‌లోనూ బుదాయ్‌కి బోలెడంత క్రేజ్‌ ఉంది ఇక మన దేశంలోనూ లాఫింగ్‌ బుద్ధను సాక్ష్యాత్తు బోధిసత్వుడి అవతారంగా భావిస్తారు సంస్కృతంలో మైత్రేయ అని సంబోధిస్తారు ఈ నవ్వే దైవం విగ్రహం ఎక్కడుంటే అక్కడ కష్టాలు ఉండవని విశ్వసిస్తారు అందుకే శుభకార్యాలకు లాఫింగ్‌ బుద్ధుడి ప్రతిమను బహుమతిగా ఇవ్వడం పరిపాటిగా మారింది అయితే విభిన్న రూపాల్లో ఉండే ఈ విగ్రహాలలో.. ఒక్కో రూపం ఒక్కో రకమైన అదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

నిల్చుంటే ఆరోగ్యం..

రెండు చేతులు పైకెత్తి.. వాటిలో బంగారు బంతులు మోస్తూ కనిపించే బుదాయ్‌ ప్రతిమను ఆరోగ్యప్రదాతగా భావిస్తారు  ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతుందట అయితే ఈ ప్రతిమ తూర్పు దిశకు అభిముఖంగా ఉంచితే మంచిదని చెబుతున్నారు బుదాయ్‌ ఫాలోవర్స్‌  ప్రధాన హాల్‌లో పశ్చిమాభిముఖంగా కూడా ఉంచవచ్చు.

సువర్ణావకాశం..
బంగారు నాణేల మీద తిష్టవేసి కూర్చున్న లాఫింగ్‌ బుద్ధా ఇంట్లో ఉంచితే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట. ఈ ప్రతిమ ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు.. సిరిసంపదలు సమృద్ధిగా కలిగిస్తుందట. కాసులపై కొలువుదీరిన హ్యాపీ బుద్ధాను వాయవ్య దిశలో.. ఉత్తరం లేదా దక్షిణాభిముఖంగా ఉంచాలని సూచిస్తారు వాస్తు పండితులు. బంగారు రంగులో నిగనిగలాడే బుదాయ్‌ ప్రతిమ నెగెటివ్‌ సిగ్నల్స్‌ను హరిస్తుందని, ఆదాయం పెంచే అవకాశాలను అందిస్తుందని చెబుతారు. వాయవ్యం దిశలో స్నానాల గది లేదా వంటిల్లు ఉంటే.. అప్పుడు ఈ ప్రతిమను ఆగ్నేయ దిశలో ఉంచితే మేలు.

విన్స్‌ ద కెరీర్‌..
డ్రాగన్‌ టార్టాయి్‌సపై దర్జాగా కూర్చున్న హ్యాపీ బుద్ధా కెరీర్‌లో విశేషమైన మార్పులకు నాంది పలుకుతాడట. ఆదాయ మార్గాలనూ అమాంతంగా పెంచేస్తాడట. ఇలాంటి విగ్రహాన్ని ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు. ఆఫీస్‌ క్యాబిన్‌లో మీ కుర్చీకి వెనుకవైపు ఉంచితే కెరీర్‌ విజయవంతంగా సాగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో అయితే ఉత్తర దిశలో ఉంచాలి.

పిల్లలకు పెన్నిధి..

చంటిపిల్లలను ఎత్తుకుని కనిపించే హ్యాపీ బుద్ధా ప్రతిమ చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో తులతూగుతారని విశ్వసిస్తారు. పిల్లల అభివృద్ధి నిరాటంకంగా సాగుతుందట. ఈ ప్రతిమను హాల్‌లో గానీ, బెడ్‌ రూమ్‌లో గానీ దక్షిణ దిశలో ఉంచడం మంచిది.

జ్ఞాన ప్రదాత..
క్రిస్టల్‌తో తయారు చేసిన లాఫింగ్‌ బుద్ధా జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ ప్రతిమను స్టడీ రూమ్‌లో ఉంచితే దాని నుంచి వచ్చే పాజిటివ్‌ సిగ్నల్స్‌ పిల్లల మనసును ప్రశాతంగా ఉంచుతుందని నమ్ముతారు. తద్వారా వారి తెలివితేటలు ద్విగుణీకృతం అవుతాయని భావిస్తారు. ఇంటి యజమాని ఆదాయం పెరగాలంటే ఈ విగ్రహాన్ని హాల్‌లో ఈశాన్య దిశలో ఉంచాలి.

Thursday, 16 July 2015

రంగు వెలిసిన ఏనుగు

రంగు వెలిసిన ఏనుగు












అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, పొదల్లో అటుఇటు గెంతులేస్తున్న కుందేళ్ళను చూశాక ఆ ఏనుగుకు నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను హంసలు, కుందేళ్ళు తెల్లగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో అనే ఆలోచన కలిగింది.ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది  కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది.

ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది స్నేహితుడి కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది నల్లగా ఉన్నది కాస్తా తెల్లగా మారిపోయింది ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది.

కొన్నిరోజుల తరువాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు రాజభటులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడపట్టి వెతకసాగారు వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు.

ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టి లాక్కుపోసాగారు భటులు ఇంతలో వర్షం మొదలయ్యింది చూస్తుండాగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్లరంగు కాస్తా కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు.

ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది ఉన్న దానితో సంతృప్తి చెందాలే కాని, లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది తన తప్పు తెలుసుకుని గట్టిగా లెంపలు వేసుకుంది.

నీ మనసే నీకు శత్రువు

మన మనస్సే మనకి శత్రువు లోకంలో శత్రుత్వం లేదు , శత్రువు లేడు, మరి ఉన్న శత్రువులు ఎక్కడినుండి వచ్చారు నీ మనసే నీకు శత్రువు దీనికి సంబంధించిన ఉపనిషత్తు కథ ఒకటి ఉంది.

ఒక ఊరిలో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమగయ్యాళి ఈమె బాధ భరించలేక భర్త ఇల్లువదిలి వెళ్ళిపోయాడు ఈమె నోటి దురుసు వలన ఊరు ఊరంతా శత్రువులు పెరిగిపోయారు ఊ అంటే కోపం, ఆ అంటే కోపం ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు పాపం ఈవిడ అయ్యో నాతో ఎందుకని ఊర్లో వారంతా ఎందుకు మాట్లాడడంలేదు నేనంటే ఎందుకు అందరికి అంత శత్రుత్వం అని తెగ బాధ పడిపోతుంది ఒకరోజు ఒక స్వామిజి ఈవిడ ఇంటికి వచ్చాడు స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది జరిగిందంతా చెప్పింది.

ఊర్లో ఎవరూ నాతో మాట్లాడడంలేదు ఎందుకు స్వామి నేనంటే అందరికీ అంత అసూయ అని అడిగింది దానికి సమధానంగా స్వామీజీ బిచ్చం పెట్టవే భొచ్చు మొహమా అన్నాడు ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది పక్కనే ఉన్న దుడ్డుకర్ర ఒకటి తీసుకుని సచ్చినోడా నువ్వేదో స్వామీజీ వని నా బాధలన్ని నీతో చెప్పుకుంటే నన్నే తిడతవా అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది.

వెంటనే స్వామీజీ నవ్వుతూ ఆగమ్మా ఆగు ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ, నాతొ శత్రుత్వం పెంచుకున్నావు నేను
దూషించాననే కదా అంటే నేను నిన్ను ఏదో అనబట్టే నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు నేను వాడిన బాష నీకు నచ్చలేదు కనుకనే శత్రువు అనుకుంటున్నావు ఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవ్వడానికి కారణం అంతే తప్ప మరొకటి కాదు ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే కనుకనే సాదుస్వభావంతో అందరిని ఒకేలా చూస్తున్నాడు నువ్వు కూడా ఇంటికి వచ్చినవారితో, నిన్ను కలిసిన వారితో సఖ్యంగా ఉండు, మృదువుగా మాట్లాడు అప్పుడు నీకు అందరు మిత్రులుగా మారతారు అని చెప్పి వెళ్ళిపోయాడు.

స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటంతో త్వరలోనే అందరూ బంధువులు అయ్యారు ఈవిషయం తెలిసి భార్త కూడా ఇంటికి తిరిగి వచ్చేసాడు.


తెనాలి రామలింగడు.. తిమ్మయ్య.. రత్తయ్య.

తెనాలి రామలింగడు


ఒకసారి తెనాలి రామలింగకవి పొరుగుదేశం వెళ్లాడు అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్లిన ఈయన కోటలోకి ప్రవేశించటం అంత సులువేమీ కాదు అయితే అక్కడికి వెళ్లి చూస్తే సరిపోతుందనుకుంటూ కోటవద్దకు చేరాడు కోట వాకిలివద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు రామలింగడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగానే.. కొత్తవాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య.

రామలింగడు రత్తయ్యను బ్రతిమలాడితే, అతడు లంచం అడిగాడు దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు.. ఇప్పుడు నావద్ద డబ్బులేదుగానీ, నువ్వుగనుక లోపలికి పంపించావంటే, నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తానని చెప్పాడు సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు.

అలా కోట లోపల కొంతదూరం వెళ్లిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు అయ్యా.. రాజుగారిని చూడాలని ఆయన అనగానే.. కొత్తవాళ్లను లోపలికి పోనియ్యమని అన్నాడు తిమ్మయ్య ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగకవి అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు.

కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో, రాజుగారు బాగా మెచ్చుకున్నాడు ఏంకావాలో కోరుకోమని అన్నాడు దీంతో మహారాజా... నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు.. అన్నాడు రామలింగడు, ఎవరయినా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా... అంటూ రామలింగడిని ఎగాదిగా చూశాడు మహారాజు తప్పదు మహారాజా... నాకు దెబ్బలే కావాలి దయచేసి ఇప్పించండి అన్నాడాయన పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు సరే కొట్టండి అని భటులను ఆజ్ఞాపించాడు.

భటులు కొరడాలతో సిద్ధమయ్యాక మహారాజా మన్నించండి ఈ కానుకలు సగం మొదటివాకిలి రత్తయ్యకు పోవాలి మరో సగం రెండోవాకిలి తిమ్మయ్యకు పోవాలని చెప్పాడు రామలింగడు ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారనీ పాపం వాళ్లను మోసం చేయడం తనకు ఇష్టంలేదని అన్నాడు. దాంతో మహారాజుకి అసలు కథ అర్థమయ్యింది ఆ తరువాత రత్తయ్యకి, తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు రామలింగడికి మాత్రం మంచి కానుకలు, రాజుగారి కొలువులో చోటు దొరికింది.
చూశారా పిల్లలూ... ఆ కాలంలోనే లంచాలకు ఆశపడినవారికి మన రామలింగకవి తెలివిగా ఎలా బుద్ధిచెప్పారో...


బేతాలుని కథలు ( బ్రాహ్మణ బాలుని కథ )

బేతాలుని కథలు












పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రివేళ, భీతిగొలిపే ఈ శ్మశాన వాతావరణం, ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా, నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు, నాకు అనుమానం కలుగుతున్నది.

కాని మనుషులు వారి స్వార్దం కోసం ఏమైనా చేస్తారు ఇందుకు ఉదాహరణగా నీకు, బ్రాహ్మణ బాలుని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:

పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు, మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది మెల్లిగా ఆమెని చేరి ఓ సుందరీ నీవెవ్వరు ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు అనడిగాడు.

అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి రాజా నేను ముని కన్యను ఈ అరణ్యంలోనే మా నివాసం అంది, రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు ఆమె రాజా నేను ముని వృత్తిలో నున్నదానిని మీరు దేశాన్నేలే మహారాజులు మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు, నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి అంది, వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ వద్దు. వద్దు నన్ను చంపవద్దు అన్నాడు ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను అన్నాడు రాక్షసుడు చెప్పు తప్పక నెరవేరుస్తా అన్నాడు రాజు.

నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు రాజు తంత్రవర్మ సరేనన్నాడు రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు.

వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు బ్రాహ్మణుడు రాజా నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో అన్నాడు, అంతలో అతడి భార్య మహారాజా నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి అన్నది రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు.

ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి విక్రమాదిత్య మహారాజా ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా భేతాళా ఆబాలుడి నవ్వులో ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి అన్నభావం ఉన్నది అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు అన్నాడు రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.