Sunday, 28 June 2015

ఒక ఊళ్లో కుంచమంత బ్రాహ్మడు

Chinnapillala Kathalu








అనగా అనగా ఒక ఊళ్లో కుంచమంత బ్రాహ్మడు ఉండేవాడు, అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్నచేను వేసుకున్నాడు అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయటం మొదలు పెట్టేవరకు రెండు భమిడిలేళ్లూ, రెండు వెండి లేళ్లూ వచ్చి రాత్రిళ్లు తినివేయటం మొదలు పెట్టినై అవి తినిపోగా ఒకటీ అరా కంకి మిగిలితే మన పొట్టిపిచిక వచ్చి పగలు తినివేస్తూ ఉండేది.

ఒకనాడు బ్రాహ్మడు పొలం వచ్చి చూసుకునే వరకు చేనంతా ఈటుపోయి ఉంది ఒకటీ అరా అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చిక తింటూ ఉంది పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది కోపం వచ్చింది ఈ పిచ్చిక పని పట్టాలి అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చు లేశాడు. పాపం పొట్టిపిచ్చిక అది కానకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది ఇంకేం, బ్రాహ్మడు ఎగిరిగంతేసి దాన్ని చంకలో పెట్టకుని ఇంటికి బయలుదేరాడు ఇక మన పిచ్చిక ఊరుకుంటుందా... చంకలో కూచునే పాట ఎత్తకుంది..

కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ......

కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ.....

రెండుభమిడిలేళ్లు గూ, గూ, గూ.....

రెండు వెండిలేళ్లు గూ, గూ, గూ.....

చేనుకాస్త మేశాయి గూ, గూ, గూ....

నేను కూడా తినబోతే గూ, గూ, గూ....

పొట్టివాడొచ్చాడు గూ, గూ, గూ....

పొంచిపొంచి చూశాడు గూ, గూ, గూ.....

నన్ను పట్టుకున్నాడు గూ, గూ, గూ.....

ఈ పాట వినేవరకు బ్రాహ్మడికి కోపం వచ్చింది చంక బాగా బిగించాడు ఊహూ, మన పిచ్చిక నోరు ముయ్యలేదు మన బ్రాహ్మడు ఏం చేస్తాడూ... ఊళ్లోకిపోతే దీనిపాటవిని అంతా నవ్వుతారు అందుకని ఊరిబయట ఉన్న శెట్టిగారి అరుగుమీద కూచున్నాడు.

మన పిచ్చిక నోరుమూస్తేగా పాడుతూనే ఉంది.

కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ.. కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ.... అని. దీనిపాటవిని శెట్టి బయటకి వచ్చి ఏమండి శాస్త్రుల్లుగారు మీ జొన్నచేనెండతండీ అన్నాడు బ్రాహ్మడు దోసిట చూపి ఇంత అన్నాడు ఇంతేనా... అన్నాడు శెట్టి కాదు అని బ్రాహ్మడు రెండు అరచేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు.

ఓసి ఇంతేనా అన్నాడు శెట్టి అప్పుడు బ్రాహ్మడికి కోపం వచ్చి రెండు చేతులూ బారచాపి ఇంత.....అన్నాడు. ఇంకేం చేయి తీసేవరకు మన పిచ్చిక తుర్రున పారిపోయి చెట్టుమీద కూచుని కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ...

కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ...... అని పాడటం మొదలుపెట్టింది బ్రాహ్మడు బాగా మోసపోయానే అని తన్ను తిట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు.

Wednesday, 24 June 2015

తెనాలి రామకృష్ణుడి తెలివి తేటలు జగత్ప్రసిద్ద మైనాయి.

Chinna Pillala Kathalu

ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు చాలా తెలివి గలవాడని విన్నాము.ఆయన తెలివిని మాకు కొంచెం పంపించ గలరు అని వ్రాసి తన దూత తో పంపించాడు రాయలు రామకృష్ణుడి వైపు చూశాడు రామకృష్ణుడు తల వూపి యింటికి వెళ్ళిపోయాడు యింటికి వెళ్లి తన పెరట్లో పచారు చేస్తూ ఆలోచిస్తూ వుండగా అతని దృష్టి అక్కడే పాకి వున్న గుమ్మడితీగ పై పడింది.

దానికి ఒక చిన్న పిందె కాసి వుండటం కనిపించింది అంటే అతనికి ఒక ఉపాయం తట్టింది బజారుకు వెళ్లి చిన్న మూతి గల కుండ నొకదానిని కొనుక్కొచ్చాడు మెల్లగా అ పిందెను ఆ కుండ లో దించాడు మరుదినం సభకు వెళ్లి ఒక నెల తర్వాత నేనే పంపుతానని చెప్పి ఆ దూతను పంపించి వేశాడు నెల తర్వాత ఆ పిందె పెరిగి ఆ కుండ నిండా
అయింది.రామకృష్ణుడు తొడిమ కత్తిరించి ఆ కుండను ఒక దూతకు యిచ్చినవాబుకు పంపుతూ ఈ కుండను పగుల గోట్టకుండా తెలివిని తీసుకోవలిసిందని వ్రాసి పంపించాడు.

ఆ నవాబుకు కుండను పగుల గోట్టకుండా దాన్ని ఎలా బయటకు తియ్యాలో తెలియక మాకు దాన్ని బయటకు తియ్యడ మేలాగో తెలీలేదు మీ రామకృష్ణుడిని పంపి తీసి యిమ్మని వ్రాసి పంపించాడు రామకృష్ణుడు ఆ నవాబు సభకు వెళ్లి ఆ కుండను తెప్పించి ఒక పదునైన కత్తిని కూడా తెమ్మన్నాడు ఆ కట్టి తీసుకొని మెల్లగా కుండలో పెట్టి
నిదానంగా ఆ గుమ్మడి కాయను ముక్కలుగా కోశాడు చెయ్యి పెట్టి మెల్లగా ఒక్కో ముక్కనే బయటికి తీశాడు సభలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తూ వుండి పోయారు.

నవాబు రామకృష్ణుడిని మెచ్చుకొని చాలా బహుమానాలిచ్చి గౌరవంగా సాగనంపాడు.

డబ్బుకు లోకం దాసోహం

Chinna Pillala Kathalu








సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు పక్కపక్క పొలాలూనూ వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే.

అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా.

ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే మెరుపులా తప్పుకున్నాడు రంగా.

పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌ అన్నాడు రాజా చిరాకు పడుతూ నీ దగ్గర దాపరికమెందుకు నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నఅన్నాడు రంగా నిజాయితీగా ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా.

ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి వారితో కలిసి నడవసాగాడు రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌ అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, డబ్బుకు లోకం దాసోహం అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.

గంగా పురాణం

Chinnapillala Kathalu








పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ వుండేది అదిదగ్గర వున్నా గ్రామాల్లోకి వెళ్లి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తినేసేది అలా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది ఆ పాపను చూస్తె దానికి చంపబుద్ధి కాలేదు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంది అడవిలోని తేనే,పళ్ళు తినిపుంచి పెంచి పెద్ద చేసింది ఆ అమ్మాయికి యుక్తవయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చిఅతనికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు సగర చక్రవర్తిగా పుట్టింది.

సగరుడు ఒకసారి కొలువు తీరి వుండగా నారదుడు వచ్చి నీవు పూర్వజన్మ లో తోడేలువి ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేసావు ఆ పుణ్య ఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తి వై పుట్టావు అని చెప్తాడు అప్పుడు సగరుడు ఒక్క కన్యను దానం చేసినందువల్లనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే యింకా యెంత పుణ్యమో నని ఆలోచించి తనకు పదహారువేల కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మ దేవుడిని గురించి తపస్సు చేస్తున్నాడు సగరుడు పదహారువేల కన్యలకు తండ్రి యై వారందరికీ పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్య ఫలం వల్ల అతనికి యింద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించిఇంద్రుడు సరస్వతీ దేవిని ప్రార్థించి సగరుడు బ్రహం దేవుణ్ణి వరం కోరేటప్పుడు అతని నాలుకపై వుండి పదహారువేల పుత్రికలు అనే బదులు పుత్రులు అనేట్టుగా చేయమని కోరాడు.సరస్వతీ దేవి అలాగే చేసింది.

సగరుడు తన పొరపాటు గుర్తించే సరికి ఆఅలస్యమై పోయింది సగరుడికి 16000 వేల మంది పుత్రులు జన్మించారు వారంతా పెరిగి పెద్దవారిన తర్వాత సగరుడు కన్యాదాన ఫలం లేకపోతె నేమి అశ్వమేధయాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. అశ్వమేధ యాగ సమయం లో ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళం లోని ఒక గుహలో దాస్తాడు అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ వుంటాడు ఆయనకు ఒక వరముంది తన తపస్సు భగ్నం చేసిన వాళ్ళను ఆయన కోపంతో చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమై పోతారు.
సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్ళను పంపిస్తాడు.వాళ్ళు వెతికి అశ్వము ఎక్కడ వుందో కనుక్కోలేక తిరిగి వస్తారు సగరుడు తన పదహారు వేల మంది పుత్రులను పంపిస్తాడు అశ్వాన్ని వెదుకుతూ భూలోకం లో కనబడక పొతే పాతాళం లో వుంటుందేమో నని వారు భూమిని త్రవ్వుతూ పోతారు పెద్ద ఆఖాతము ఏర్పడుతుంది త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు అక్కడ కపిల ముని తపస్సు చేసుకుంటూ వుంటాడు అతనికి దగ్గరలోనే అశ్వము ఒక స్తంభానికి కట్టి వేయబడి వుంటుంది అది చూసి వాళ్ళు కోపోద్రిక్తు లై మునిని దూషిస్తూ ఓ..దొంగ  మునీ మా యాగాశ్వమును దొంగిలించి యిక్కడ దొంగ తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నావా అని గట్టిగా అరుస్తారు దీర్ఘ తపస్సులో వున్నకపిలుడు మాట్లాడడు వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు అప్పుడు కపిలుడికి తపో భంగ మై కళ్ళు తెరుస్తాడు ఆపదహారువేల మంది సగర పుత్రులు భస్మ మై బూడిదగా మారుతారు.

ఆ విషయము నారదుడి వల్ల తెలుసు కొని సగరుడు చాలా దుఖిస్తాడు వాళ్లకు పుణ్యలోకాలు కలుగాజేయాలనుకుం
టాడు నారదుడు వచ్చి గంగను గూర్చి తపస్సు చేసి గంగను ఆ భస్మరాసి మీద పారేట్టుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగు తాయని చెప్తాడు సగరుడు వెయ్యేండ్లు తపస్సు చేసి తపస్సు చేస్తూనే మరణిస్తాడు.తరువాతి తరం వారు కూడా ప్రయత్నించి విఫలు లవుతారు సగరుడికి మూడో తరం వాడైన భగీరథుడు గంగను గూర్చి తపస్సు చేసి ఆమెను మెప్పిస్తాడు.

ఆమె నేను ఆకాశము నుండి క్రిందకు దూకితే ఆ వేగము భూమి ఓర్వలేదు నన్ను భరించే శక్తి పరమ శివుడికి మాత్రమే వుంది ఆయనను ప్రసన్నం చేసుకొని రా అని చెప్తుంది భగీరథుడు ఈశ్వరుడిని గూర్చి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్ష మై గంగను నేను భరిస్తాను అంటాడు అప్పుడు గంగ ఆకాశము నుండి శివుని మీదకు దూకుతుంది శివుడు గంగను తన జటాజూటం లో బంధిస్తాడు భగీరథుని కోరిక మేరకు తన ఒక జటవిప్పుతాడు అందు లోనుంచి గంగ ఒక పాయగా భగీరథుని వెంట వస్తూ వుండగా జహ్నువు అనే రుషి ఆశ్రమము మీదుగా ప్రవహిస్తూ ఆ ఆశ్రమాన్ని ముంచి వేస్తుంటే జహ్ను ముని కోపం తో ఆమెను తనగొంతులో బంధిస్తాడు.భగీరథుడు జహ్ను మునిని ప్రార్థించి గంగను విడిచి పెట్టమంటాడు.

ఆయన తన చెవి నుండి గంగను వదులు తాడు అందుకే గంగ కు జాహ్నవి అనే పేరు వచ్చింది గంగ భగీరధుడి వెంట వచ్చి ఆ భస్మ రాసుల మీదుగా ప్రవహిస్తుంది అప్పుడు సాగరపుత్రులకు ఉత్తమ లోకాలు సంప్రాప్త మవుతాయి భగీరథుడు క్రిందకు తెచ్చినాడు కాబట్టి గంగ భాగీరథి అయింది సగరపుత్రులు త్రవ్విన ఆఖాతాన్ని పూడ్చడానికి ఇంద్రుడు పెద్ద వర్షము కురిపించి ఆ ఆఖాతాన్ని నీటితో నింపి వేస్తాడు అదే యిప్పుడు మన సముద్రము సగర పుత్రుల చేత త్రవ్వబడినది కాబట్టి సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది.

మూడు రాళ్లు

ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు అతడు బాగా వృద్ధుడు ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి, ఇలా అన్నాడు , నాయనలారా.... నేను ఎంతోకాలం జీవించను ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, ఈ ఆస్తిని సంపాదించాను మిమ్మల్ని పెంచి పెద్దవాళ్లను చేశాను ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా... అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి సత్యమూర్తి తెలివైనవాడు. 

నా వ్యాపారాభివృద్ధికి అతను ఎన్నో సలహాలిచ్చినవాడు అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి అప్పుడే నాకు మనఃశాంతి కలుగుతుంది అలా చేస్తామని నాకు మాటివ్వండి అన్నాడు అలాగే చేస్తామని ముగ్గురు కొడుకులూ ప్రమాణం చేశారు కొద్దిరోజుల్లోనే నారాయణ మరణించాడు ఆ తర్వాత ముగ్గురు కొడుకులూ, తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు ఆతృతగా వారు ఆ పెట్టెను తెరిచారు.

అందులో ఇంటి తాళాలు, మూడు రాళ్లు, ఒక ఉత్తరం ఉన్నాయి ఆ ఉత్తరం పైన సత్యమూర్తి మాత్రమే చదవాలి అని రాసి ఉంది సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు తర్వాత ముగ్గురి వైపు తిరిగి, అబ్బాయిలూ... ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు ఏంటది...? అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను ముందు ఆ మూడు రాళ్లను పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి మీకు ఏమైనా తోస్తే చెప్పండి అని అడిగాడు సత్యమూర్తి.

ఓస్ అదేమంత పెద్ద విషయం కాదు మీ ముగ్గురు మూడురాళ్లను వెనకేసుకోండి అంటే దుబారా ఖర్చులు మాని, మరింత సంపాదించండి అని చెప్పి ఉంటాడు అందువలన ఎవరి ఆస్తి వారికి ఇచ్చేస్తే, మేం మరింత అభివృద్ధి చేసుకుంటాం అన్నాడు పెద్దకొడుకు అంతే కాదు మూడు రాళ్లలా ఎక్కువ తక్కువ కాకుండా, మూడు వాటాలు సమానంగా వేసుకొని జీవించండి అని చెప్పి ఉంటాడు అన్నాడు రెండోవాడు .

ఇక మూడోవాడు, ఆ మూడు రాళ్లు పొయ్యికి గల మూడు రాళ్లు అంటే మూడు రాళ్లు కలిస్తేనే కమ్మని వంట వండటం సాధ్యమవుతుంది అలాగే మేం ముగ్గురం కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని చెప్పడానికే ఆ మూడు రాళ్లు పెట్టాడు అని వివరించాడు. ముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత, సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని వారికి చూపాడు అందులో ముగ్గురు అన్నదమ్ములు కలసిమెలసి ఉండాలి నా కోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్నవారికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని రాసి ఉంది.

చదివారు కదా మీ నాన్న ఉద్దేశాన్ని మూడోవాడే చక్కగా అర్థం చేసుకున్నాడు మనసు ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి తండ్రి ఉద్దేశం ఎరిగిన కొడుకే అతని కోరికను నెరవేర్చగలడు అందుకే కలసిమెలసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న మూడోవాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ తాళాలు మూడోవాడికి ఇచ్చాడు సత్యమూర్తి.

ఈ తాళాలు నా ఒక్కడివి కావు మనందరివీ అని తన అన్నలిద్దర్నీ కలుపుకొని ముందుకు నడిచాడు మూడోవాడు తను చెప్పినట్లే పెట్టెలో మూడు రాళ్లు పెట్టి సులువుగా సమస్యను పరిష్కరించినందుకు నారాయణను మనసులోనే అభినందించాడు సత్యమూర్తి.