Monday, 29 June 2015

భారతంలో ఒక కథ- "శిఖండి"

Chinnapillala Kathalu





కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళు అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా, భీష్ముడు తన తమ్ముడికి పెళ్లి చేయాలనుకుని ఆ స్వయంవరానికి విచ్చేసాడు. స్వయంవరానికి వచ్చిన వారి మధ్య కలహాలు చెలరేగాయి అపుడు భీష్ముడు అందరిని ఓడించి ఆ ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపురం తీసుకువచ్చి పెళ్లి ఏర్పాట్లు చేయమన్నాడు అపుడు అంబ భీష్ముడి దగ్గరకు వచ్చి గాంగేయా నా మనసంతా సాళ్వభూపతి మీద ఉంది అతనే నా ప్రాణనాయకుడు మనసు లేని మనువు క్షేమం కాదు.

నన్ను సాళ్వుని దగ్గరకు చేర్చు, నా చెల్లెల్లిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లిచేయ్యి అని వేడుకుంది భీష్ముడు సరేనని అంబని సాళ్వదేశానికి పంపాడు  సాళ్వుడు అంబని చేసుకోడానికి నిరాకరించాడు నువ్వంటే ఇష్టం ఉన్న, వేరొకరు చేజిక్కించుకున్న విజయఫలాన్ని నేను అందుకోలేను అని పరుషంగా వెళ్లిపొమ్మన్నాడు తిరిగి హస్తిన కొచ్చిన అంబని భీష్ముడు కూడా నిరాకరించాడు.

అపుడు అంబ నీ వలననే నా ఆశలన్ని నేలరాలాయి నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను నిన్ను నేనే సంహరిస్తాను అని శపథం చేసింది అంబా నువ్వు ఏనాడూ ఐతే అస్త్రం చేతపూని నా ఎదుట నిల్చెదవో అపుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను అని భీష్ముడు కూడా ప్రతిన పూనాడు తన కూతురిబిడ్డ ఐన అంబ విషయం తెలుసుకున్న హోత్రవాహనుడనే రాజర్షి తనను చూసేందుకు వచ్చిన పరశురాముడికి చెప్పి సహాయం చేయమని అడిగాడు తన తపశ్శక్తితో ఒక వరమాలను చేసి అంబా ఈ మాల ధరించిన వారి చేతిలోనే భీష్ముడి ఓటమి, తప్పదు ఇదే నీకు చేయగల సహాయం అని చెప్పాడు.

ఆ వరమాల ధరించే వారికోసం అంబ ఎందరినో అడిగి లేదనిపించుకొని చివరకు ద్రుపదుడిని మాల ధరించి భీష్ముడిని ఎదిరించమని వేడుకుంది. ద్రుపదుడు అందుకు ఒప్పుకొనక పోయేసరికి విసిగి కోపంతో ఆ వరమాలను కోటగుమ్మానికి వేలాడదీసి వెళ్ళిపోయి, ఆత్మాహుతి చేసుకుంది. ద్రుపదుడు సంతానం కోసం యాగం చేయగా అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు జన్మించారు. అందులో మొదటి సంతానంగా అంబ జన్మించింది అంబ
అక్కడ కోటగుమ్మానికి ఉన్న వరమాలను తీసి తన మెడలో వేసుకుంది.

అది చూసిన ద్రుపదుడు కోపోద్రేకంతో భీష్ముడితో వైరమా అని అంబని తన రాజ్యం నుంచి వెళ్ళకొట్టాడు అంబ తన ప్రతిజ్ఞ నేరవేరడంకోసం శివుడికోసం తపస్సుచేసి పురుషుడిగా మారింది ఆ అంబనే శిఖండి. మహాభారత యుద్దంలో అర్జునుడిరథం ముందుభాగంలో శిఖండి అస్త్రం చేతబూని ఉండడం చూడగానే భీష్ముడు తన చేతిలోని అస్త్రం జారవిడిచాడు అదను చూసి అర్జునుడు భీష్ముడిని హతమార్చాడు ఆ విధంగా అంబ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంది.

ఒక పొట్టి పిచిక






అనగా అనగా వో వూర్లో ఒక పొట్టి పిచిక ఉండేది. అదేం చేసిందీ, ఊరల్లా తిరిగి ఉలవ గింజ, చేనల్లా తిరిగి సెనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లాంటివి ఎన్నోగింజలు పోగుచేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుంది చేసుకుని, చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచిక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే, చీమ తలకాయంత రొట్టెముక్క చెట్టు తొర్రలో పడిపోయింది.

అప్పుడా పిచిక ఏం చేసిందీ, వడ్రంగి దగ్గరికి వెళ్ళి, వడ్రంగీ, వడ్రంగీ, అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్ చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది. వడ్రంగి, చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా అని పక పక నవ్వాడు. అప్పుడా పిచిక కెంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారూ, రాజుగారూ, అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటూంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగి నడిగితే తీయనన్నాడు వడ్రంగిని దండించు రాజా అంది.

రాజు కూడా నవ్వి,ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా దండించను పో అన్నాడు రాజు అమ్మా, వీడి పని ఇలా ఉందా.... అని ఆ పిచిక వెంటనే లేళ్ళ దగ్గరికి వెళ్ళి, జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజుకు ఉద్యానవనమంటే ఎంతో ఇష్టం అది పాడు చెయ్యండి లేళ్ళూ అంది. ఈ చీమ తలకాయంత రొట్టి ముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా చాలు చాలు పో అన్నాయి లేళ్ళు.

అమ్మా వీటమ్మ కడుపు కాలా ఈ వెధవ లేళ్ళకు ఇంత తెగులా అని ఆ పిచిక ఏం చేసిందీ, బోయవాడి దగ్గరికి వెళ్ళి, బోయాడూ, బోయాడూ, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వడ్రంగి ని దండించమంటే రాజలా చెయ్యలేదు రాజు పూలతోట పాడు చెయ్యమంటే లేళ్ళు పాడుచెయ్యలేదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టు బోయాడూ అంది. ఇదంతా విని బోయవాడు, ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్ళ కాళ్ళను విరక్కొట్టనా బాగానే ఉంది, వెళ్ళు వెళ్ళు అని పంపేసాడు.

దాంతో పిచ్చిక్కి కోపమెక్కువై ఎలక దగ్గరికి వెళ్ళి, ఓయ్ ఎలకా, ఎలకా, ఓ సహాయం చేసి పెట్టాలి చీమ తలకాయంత రొట్టి చింత చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయవాడి చెప్పులు కొరికి పాడు చెయ్యి ఎలకా అంది ఎలక కూడా నా వల్ల కాదు పొ"మ్మని అంది.

అమ్మ దొంగ ముండా నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి, పిల్లి బావా, పిల్లి బావా చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పటిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు ఎలుకను వేటాడు పిల్లీ అంది నాకిప్పుడు చాలా పనులున్నాయ్ ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది.

అయ్యో దీని దర్జా మండా ఉండు దీని పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికెళ్ళి, అవ్వా అవ్వా, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు పిల్లి ఎలకను వేటాడలేదు పిల్లి మీద వేడి వేడి పాలు పొయ్యి అవ్వా అంది. చీమ తలకాయంత రొట్టి ముక్క కోసం పిల్లి మీద పాలోస్తానూ చాలు చాల్లే అని అవ్వ కసిరి పొమ్మంది.

ఏమి తూలిపోతున్నావే మామ్మా అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు పిల్లి ఎలకను వేటాడలేదు అవ్వ పిల్లి మీద వేడి పాలొయ్యలేదు అవ్వను చితక్కొట్టు తాతా" అంది.

అమ్మో నేనలా చేస్తానా చెయ్యను పో అన్నాడు తాత ఓహో నీకింత గర్వమా సరే అని ఆ పిచికేం చేసిందీ, గబ గబా ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు పిన్నీ, ఆవు పిన్నీ, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలొ పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటె బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు పిల్లి ఎలకను వేటాడలేదు పిల్లి మీద అవ్వ వేడి పాలొయ్యలేదు, తాత అవ్వను చితక్కొట్టలేదు తాత పాలు తియ్యడానికొచ్చినప్పుడు ఫెడీ మని తన్ను ఆవూ అంది.

అబ్బే, నేనలా చెయ్యను సుమా అంది ఆవు అప్పుడు పిచిక విచారిస్తూ, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో ఎవళ్ళనడిగినా ఏమీ చెయ్యనంటున్నారు ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది ఇంతట్లో ఒక ఈగ ఆ దారమ్మట వెడుతూ ఏం పిచికా ఏడుస్తున్నావు అనడిగింది పిచిక జరిగినదంతా చెప్పి ఉపకారము చేసి పెట్టమంది.

అప్పుడు ఈగ ఏం చేసిందీ, వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరీ చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపం వచ్చి అవ్వని చితక కొట్టాడు. అవ్వకు వొళ్ళు మండి, పిల్లి మీద వేడి పాలోసింది. పిల్లి కోపం కొద్దీ ఎలక వెంట పడింది. ఎలక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది. బోయవాడు ఆ కోపం తీర్చుకోడానికి లేళ్ళ కాళ్ళను విరక్కొట్టాడు. లేళ్ళు కోపం చేత రాజు గారి తోటను పాడు చేసాయి. రాజుకి బుధ్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు, చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టి ముక్కనూ తీసి పిచిక చేతిలొ పెట్టాడు. పిచిక మళ్ళీ ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది.

Sunday, 28 June 2015

సింహం-నక్క-ఎలుగుబంటి

Chinnapillala Kathalu




























సింహం-నక్క-ఎలుగుబంటి దీనిలాంటి కథే ఒకటి స్కాంద పురాణంలో ఉంది ఇది చదివాక, మంచి-చెడు, ధర్మం-అధర్మం గురించిన ఆలోచనలు రేకెత్తించే అద్భుతమైన ఆ కథ ను కూడా చదివి చూడండి.

గండకీ నదీ తీరంలో దట్టమైన ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక నక్క - ఎలుగుబంటు చాలా అన్యోన్యంగా ఉండేవి నక్క ముసలిది సొంతగా ఆహారం సంపాదించుకునే శక్తి దానికి ఇప్పుడు లేదు ఎలుగుబంటిది మంచి మనసు తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడైన నక్కకూ కొంచెం పెట్టేది అది, ఒకనాడు నక్క , ఎలుగుబంటి కలసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూండగా ఆకలిగొన్న సింహం ఒకటి వీటికి ఎదురైంది పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి, నక్కతో మిత్రమా, నక్కా..... నువ్వేమో ఇప్పుడు పెద్దగా ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఉన్నావు.

ఆ సింహమేమో ఆకలిగొని ఉన్నది మన వైపే వస్తోంది దానికి చిక్కామంటే అంతే అందుకని నువ్వు నా వీపును కరచుకో నేను ఈ మహావృక్షాన్ని ఎక్కుతాను అన్నది. ఆ సరికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే తటాలున దాని వీపును కరచుకున్నది ఎలుగుబంటి చకచకా చెట్టు ఎక్కేసింది చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి - నక్క కదలక మెదలక ఉండగా చెట్టుకింద సింహం వాటివైపే చూస్తూ కూర్చున్నది ఎలుగు - నక్క చెట్టు దిగలేదు సింహం ఎంతకీ పక్కకు కదలలేదు.

ఇంక కుదరదు అనుకున్న ఎలుగుబంటి, చెట్టుపైనే కొన్ని కొమ్మలు విరిచి, పడుకోవడానికి ఒక పక్కను ఏర్పాటుచేసింది చీకటిపడ్డాక అది నక్కతో మిత్రమా.... సింహం పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు అయినా ఈ రోజంతా మన జాగ్రత్తలో‌ మనం‌ ఉండాలి మనలో ఒకరు నిద్రిస్తే, ఇంకొకరు కాపలాగా మేలుకొని ఉండాలి అన్నది నక్క సరేనన్నది. అప్పుడు ఎలుగుబంటి వయసు పైబడ్డ దానివి ముందు నువ్వు నిద్రపో అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్ర లేపి, ఆపైన నేను నిద్రపోతాను నువ్వు కాపలా కాద్దువు అని నక్కతో అన్నది నక్క సరేనని గాఢంగా నిద్రపోయింది ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది.

చెట్టుక్రిందనే వీటికోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న సింహం కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో అన్నది ఓ మిత్రమా, ఎలుగు బంటీ నువ్వు ఆ ముసలి నక్కకి కాపరివని నాకు తెలుసు అయినా నా మాట విను నువ్వు గానీ ఆ నక్కను కిందకి తోసేశావంటే, నేను దాన్ని తినేసి వేరే అడవికి వెళ్ళి పోతాను అట్లా నా ఆకలీ తీరుతుంది నీకు ఆ ముసలినక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువూ తగ్గుతుంది అని ఎలుగుబంటి టక్కున జవాబిచ్చింది చూడు, సింహరాజా ఈ ముసలి నక్క నాకు ఎంత మాత్రమూ భారం కాదు.

నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దానికి ఇస్తున్నాను అది నన్నే నమ్ముకుని బ్రతుకుతోంది నామీద నమ్మకంతో అది ఎంత హాయిగా నిద్రపోతోందో చూడు "ఏ జీవికీ నిద్రాభంగం కలిగించకూడదు అది మహా పాపం" నిద్రలోనే కదా, అన్ని ప్రాణులూ బడలికను పోగొట్టుకొని హాయినీ, సుఖాన్నీ పొందేది నేను దీన్ని మోసం చేయటం అసంభవం ఎన్ని రోజులైనా సరే నన్ను నమ్మిన ఈ నక్కకు నేను తోడుంటాను అని అంతలోనే రాత్రి మూడవ జాము ప్రవేశించింది. ఎలుగుబంటి నక్కను నిద్రలేపి, తాను పడుకున్నది.

కొంత సేపటికి, ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక, చెట్టు క్రింద ఉన్న సింహం ఈసారి నక్కను పలకరించింది నక్కబావా నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో గదా ఈ ఎలుగుబంటి తను తినదు నిన్ను తిననివ్వదు నాకు తెలుసు. నా మాట వింటానంటే ఓ సంగతి చెబుతాను నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని కిందికి తోసెయ్యి నేను దాన్ని చంపి తిని, మిగిలిన మాంసాన్ని నీకూ పెడతాను నువ్వూ తినొచ్చు మీలో ఎవరినో ఒకరిని తినకుండా ఇక్కడినుండి కదలకూడదని నేను ఎలాగూ నిశ్చయించేసుకున్నాను నా నిశ్చయం ఎంత దృఢమైనదో నీకు తెలుసు తెలివైనదానివి ఆలోచించి నిర్ణయం తీసుకో ఆ ఎలుగును తోసెయ్యి అన్నది, నక్కను ప్రలోభ పెడుతూ.

నక్క కాసేపు ఆలోచించి- ఎలుగుబంటిని కిందికి తోసేసింది.

కిందపడ్డ ఎలుగు దగ్గరకొచ్చి నిలబడి, సింహం ఎగతాళిగా నవ్వుతూ ఎలుగుబంటీ, చూశావా ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందికి తోసెయ్యకపోతివే అది చూడు, నిన్ను ఊరకనే కిందికి తోసేసింది చూస్తివా, నక్క తెలివి అన్నది. ఎలుగుబంటి విచారంగా నవ్వి, సింహరాజా ఆ ముసలినక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకొని బతుకుతోంది ఈరోజున అదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను వమ్ము చేయను ఎందుకంటే నామీద నాకు విశ్వాసం ఉంది నేను కౄరజంతువునే కానీ ఏ ప్రాణికీ కావాలని హాని తలపెట్టను నా మంచితనం వల్ల నాకు హాని వాటిల్లదు అనేది నా విశ్వాసం.

నువ్వు నన్ను ఒక్కసారిగా చంపి తిని, నీ ఆకలి తీర్చుకుంటావు నాకు కలిగే బాధ కేవలం ఆ క్షణం మాత్రమే కానీ నక్క... దానంతట అది క్రిందికి దిగలేదు మరి చెట్టు మీద దానికి ఆహారమూ దొరకదు చివరికది ఆకలితో విలవిలలాడుతూ చస్తుంది లేదా చెట్టు మీది నుండి క్రిందపడి ఎముకలు విరిగి చస్తుంది ఇది సత్యం.

ఇక ఈ నక్క తెలివైనది కాదు అనేది స్పష్టం దానికి ఉన్నది కేవలం మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప, తెలివి కాదు నిజానికి నక్క తిక్కది అందుకనే ముందుచూపు లేక, ఈ పనికి ఒడి గట్టింది అన్నది ఎలుగుబంటి, ధైర్యంగా నేను నిన్ను తినకుండా వదిలేస్తాను మరి ఇప్పుడయినా చెట్టెక్కి నక్కను క్రిందికి తోసేస్తావా అంది సింహం అలా చేయను ఎందుకంటే, మోసం చేసినవాడు తనంతట తానే నష్టపోతాడు అని దీని ద్వారా అందరికీ తెలియాలి అన్నది ఎలుగు బంటు.

ఇన్ని విషయాలు తెలిసిన నిన్ను తింటే అది నాకు మంచిది కాదు నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే నీ దారిన నువ్వు పో అని బయలుదేరింది సింహం ఎలుగుబంటి కూడా తన దారిన తాను వెళ్ళింది ,నక్క మాత్రం అటు చెట్టు దిగలేక, ఇటు ఆహారమూ లేక అలమటించి, చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు విడిచింది.

చిన్నపిల్లల కథలు

Chinnapilla Kathalu








ఒకసారి సనకసనందనులు అనే నల్గురు ఋషులు విష్ణువును దర్శించ టానికి వైకుంట మునకు పోతారు అక్కడ జయ,విజయులనేడి ద్వార పాలకులు వారిని లోనికి పోవడానికి అనుమతించరు వారు ఎన్ని విధాల చెప్పి చూసినా వారు లోనికి అనుంతించరు అప్ప ుడు వారికి కోపం వచ్చి మీరు భూలోకంలో మానవులుగా పుట్టుదురు గాక అని శాపం యిస్తారు అప్పుడే విష్ణువు బయటికి వచ్చి ఆ ఋషులను క్షమించ మని వేడి జయ విజయులను మందలిస్తాడు.

వారిచ్చిన శాపమును గురించి విని విష్ణువు జయవిజయుల తో యిలా చెప్తాడు మీరు భూలోకం లో మంచి వారుగా పుట్టి ఏడు జన్మల తర్వాత నన్ను చేరుకుంటారా లేక రాక్షసులై పుట్టి నన్ను ద్వేషిస్తూ మూడు జన్మల లో నా చేత
చంప బడి నన్ను చేరుకుంటారా మీకేది యిష్ట  మో చెప్పండి అప్పుడు వారు స్వామీ మీకు దూరంగా ఏడు జన్మలు
వుండలేము రాక్షసులుగా పుట్టి మూడు జన్మ లలో మీ చేత చంపబడి మిమ్ములను చేరుకోవడమే మాకు యిష్టము అని చెప్తారు.

వారిద్దరూ మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా పుట్టి లోక కంటకులై అందరినీ బాధ పెడుతుంటారు.వరాహావతారము లో హిరణ్యాక్షుడినీ,నరసింహావతారం లో హిరణ్యకశిపు డినీ విష్ణువు సంహరిస్తాడు
రెండవ జన్మ లో రావణ,కుంభకర్ణులు గా పుట్టి లోక కంటకు లై చరిస్తూ వుంటారు అప్పుడు విష్ణువు శ్రీరాముడు గా పుట్టి వారిని సంహరిస్తాడు మూడవ జన్మ లో శిశుపాల, దంతావ క్త్రు లుగా పుడతారు.విష్ణువు శ్రీ కృష్ణుడు గా అవతరించి వారిద్దరినీ సంహరిస్తాడు శిశుపాలుడిని వంద తప్పుల వరకూ క్షమించి ధర్మరాజు చేసిన రాజసూయ యాగం లో శిశు పాలుడిని తన చక్రము తో సంహరిస్తాడు.

అప్ పుడే శిశుపాలుడి ఆత్మ ఆయనలో లీన మవుతుంది యిక దంతవక్త్రుడు వృద్ధ శర్ముకు,శ్రుత దేవకు పుట్టిన కొడుకు శ్రుతదేవ వసుదేవుడి చెల్లెలు శిశుపాలుడు యితడి అన్న ఇతను కరూష దేశానికి అధిపతి తన మిత్రులైన పౌండ్రక వాసుదేవాదులనుశ్రీకృష్ణుడు చంపడం వల్ల కృష్ణుడి మీద పగ పెంచుకుంటాడు తన మిత్రులకు ఉత్తర క్రియలు జరిపిస్తూ వుంటే అక్కడ కృష్ణుడిని చూసి అతనితో యుద్ధము చేసి కృష్ణుడి చేతిలో మరణిస్తాడు అతని తేజస్సు కృష్ణుడి లో ఐక్య మవుతుంది అలాగ జయ,విజయులు తిరిగి విష్ణువును చేరుకుంటారు.

కవితాయ స్వాహా








విజయనగర సామ్రాజ్యం లోని ఒక వూరిలో అక్కిసెట్టి అనే ఒక కోమటి వుండేవాడట అతను గుగ్గిళ్ళు చేసి అమ్ముతూ వుండే వాడట అతనికి తెనాలి రామకృష్ణుడు అన్ని పద్యాలు చెప్తాడు కదా నేనూ కవిత్వం వ్రాస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది రామకృష్ణుడు దగ్గరికి వెళ్లి కవిత్వం వ్రాయడానికి చిట్కా లేమైనా చెప్పమని అడిగాడు.

రామకృష్ణుడు నీకు ఈ కవిత్వం వ్రాయాలనే పిచ్చి ఎందుకు అందరికీ కవిత్వం పట్టుబడదు హాయిగా గుగ్గిళ్ళు అమ్ముకుంటూ బ్రతుకు అని నచ్చ చెప్పాడు కానీ ఆ కోమటి కాదుకూడదు మీరు నాకు చిట్కాలు చెప్పాల్సిందే అని పట్టు బట్టాడు అప్పుడు రామకృష్ణుడు సరే అయితే పున్నమి రాత్రి వెళ్లి ఏదైనా మంచి తోటలో చెట్టుక్రింద కూచుని ఆలోచిస్త్తూ వుండు ఏదైనా స్ఫురించ వచ్చు అని చెప్పి పంపించాడు.

సరే నని ఆ అక్కిసెట్టి పున్నమ నాటి రాత్రి ఒక తోటలో కూర్చుని ఆలోచిస్తున్నాడట అలా చంద్రుడిని చూస్తూ వుంటే అతనికేదో స్ఫురించింది వెంటనే వ్రాసుకున్నాడు పున్నమి వెన్నెల కాసెగా అది చాలా బాగుంది అని పించింది సెట్టికి యింక ఉత్సాహం వచ్చేసింది ఒక పాదం వచ్చింది కదా అని ఆలోచిస్తూ వుంటే ఒక కోయిల కుహూ కుహూ అని కూసింది.

వెంటనే అతనికి యింకో పాదం స్ఫురించింది పోనాపై కోయిల కూసెగా చాలా బాగుంది అనుకున్నాడు యింక యెంత ఆలోచించినా మూడో పాదం రాలేదు అప్పటికే అర్ధరాత్రి అయి పోయింది యింక యివ్వాల్టికి చాలని యింటికి వెళ్లి పోయాడు యింటికి వెళ్ళగానే చూస్తే ఎప్పుడో ప్రొద్దున చేసిన గుగ్గిళ్ళు అన్నీ పాసిపోయాయి.

ఆ దినం ఆదాయం కూడా పోయింది అయిన అతనికి వెంటనే యింకో పాదం స్ఫురించింది అంగట్లో గుగ్గిళ్ళు పాసేగా
అదీ వ్రాసుకున్నాడు.నాలుగో పాదం యెంత ఆలోచించినా రాలేదు యింక రేపు చూసుకోవచ్చు లే అని పడుకున్నాడు ప్రోద్దునలేచి యెంత ప్రయత్నించినా నాలుగో పాదం రాలేదు సరే అనుకోని రామకృషుని దగ్గరకు వెళ్లి మూడు పాదాలూ వినిపించాడు.నాలుగో పాదం చెప్పమని బ్రతిమలాడాడు.

పున్నమి వెన్నెల కాసెగా పొన్న పై కోయిల కూసెగా అంగట్లో గుగ్గిళ్ళు పాసెగా రామకృష్ణుడు వెంటనే 4వ పాదం అక్కి శెట్టి ముండ మోసెగా అంటే వ్యాపారం జరుగక అక్కిసెట్టి నష్ట పోయాడు అని దాని అర్థం  నేను చెప్పాను కదా కవిత్వము అందరికీ రాదు అనీ వెళ్లి చక్కగా వ్యాపారం చేసుకో అని బుద్ధి చెప్పి పంపించేశాడు అక్కిసెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకుంటూ బ్రతికేసాడు.ఈ కథ మీ పిల్లలకు చెప్పండి నవ్వుకోడానికి బాగుంటుంది.